
* ఉన్న కాస్త భూమినీ విరాళమిచ్చారు
* తమ ఆస్తుల వివరాలను వెల్లడించిన ప్రధాని, మంత్రులు
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. తన వద్ద ఉన్న భూమిని విరాళంగా ఇచ్చేయడంతో ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.2.23 కోట్లుగా ఉంది.
ఏటా ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడిస్తున్న ప్రధాని… ఈ ఏడాది మార్చి 31 నాటికి తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. పీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం… గతేడాదితో పోలిస్తే ప్రధాని ఆస్తులు రూ.26లక్షల మేర పెరిగాయి. మొత్తం ఆయన ఆస్తుల విలువ రూ.2.23 కోట్లుగా ఉండగా.. వీటిలో అధికంగా బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. ప్రధాని మోడీకి ఎలాంటి స్థిరాస్థులూ లేవని పీఎంవో స్పష్టంచేసింది. గుజరాత్ లోని గాంధీనగర్‌లో ఉన్న కొంత నివాసయోగ్యమైన భూమిలో తన వాటాను దానంగా ఇచ్చినందున ఆయనకు స్థిరాస్తులేమీ లేవని తెలిపింది. ప్రధానికి బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఎలాంటి పెట్టుబడులూ లేవని, ఆయనకు సొంత వాహనం కూడా లేదని వెల్లడించింది. కానీ ఆయనకు నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయని, వాటి విలువ రూ.1.73లక్షలుగా ఉంటుందని డిక్లరేషన్‌లో పేర్కొంది. అయితే, మార్చి 31, 2021 నాటికి మోడీ వద్ద ఉన్న రూ.1.1 కోట్ల విలువ చేసే ప్లాట్ ను విరాళంగా ఇవ్వడంతో ప్రస్తుతం ఆయన వద్ద ఎలాంటి స్థిరాస్తులు లేవని పేర్కొంది. దీంతో ఈ ఏడాది మార్చి 31 నాటికి మోడీ మొత్తం ఆస్తుల విలువ రూ.2,23,82,504లుగా ఉన్నట్టు తెలిపింది.
2002 అక్టోబర్‌లో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మరో ముగ్గురు వాటాదార్లతో కలిసి కొనుగోలు చేసిన నివాసయోగ్య భూమి (సర్వే నంబర్ 401/ఎ)లో ఒక్కొక్కరికి 25శాతం సమాన వాటా ఉందని.. దాన్నే మోడీ విరాళంగా ఇచ్చినట్టు తెలిపింది. దీంతో ప్రస్తుతం మోడీ చేతిలో రూ.35,250నగదు, పోస్ట్ ఆఫీస్‌లో రూ.9,05,105 విలువ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లతో పాటు రూ.1,89,305 విలువ చేసే జీవిత బీమా పాలసీ ఉన్నట్టు పేర్కొంది.
మరోవైపు, ప్రధానితో పాటు తమ ఆస్తుల వివరాలు వెల్లడించిన కేబినెట్ మంత్రుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు రూ.2.54కోట్ల విలువ చేసే చరాస్తులు ఉండగా.. రూ.2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మొత్తం 29 మంది కేబినెట్ మంత్రులు ఉండగా.. గత ఆర్థిక సంవత్సరంలో తమ సొంత, వారిపై ఆధారపడిన వారి ఆస్తులు ప్రకటించిన వారిలో ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్‌కే సింగ్, హర్‌దీప్ సింగ్ పురీ, పురుషోత్తం రూపాలా, జి.కిషన్ రెడ్డి ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కేబినెట్ మంత్రిగా పనిచేసి, గత నెలలోనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు.





