
* ఆస్ట్రేలియా తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు…
* ఆసీస్ వైఖరితో నిర్ఘాంత పోయిన క్రీడాలోకం
కామన్వెల్త్ క్రీడలు ముగిశాక మహిళల క్రికెట్ కు సంబంధించిన ఘోరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కోవిడ్ పాజిటివ్ గా నిర్ణారణ అయిన ఓ క్రికెటర్ బరిలోకి దిగడమే కాకుండా అందరితో కలియతిరిగుతూ సంబరాలు చేసుకుంది. భారత్ తో ఫైనల్ మ్యాచ్ కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ తహ్లియా మెక్ గ్రాత్ కు కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా ఆసీస్ మేనేజ్‌మెంట్ అమెను తుది జట్టుకు ఎంపిక చేసి, బరిలోకి దించింది.
ఈ మ్యాచ్‌లో మెక్ గ్రాత్ బ్యాటింగ్‌లో 2 పరుగులు చేసింది. అలాగే బౌలింగ్‌లో 2 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఆసీస్ మేనేజ్ మెంట్ ని నిరాశ పరచింది. టీమిండియా స్వయంకృతాపరాధాల కారణంగా ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. అయితే, తమ ప్లేయర్ కు కోవిడ్ అని తెలిసినా ఆసీస్ యాజమాన్యం ఆమెను తుది జట్టుకు ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త తెలిసి యావత్ క్రీడాలోకం షాక్ కు గురైంది.
ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆసీస్ యాజమాన్యం వ్యవహరించిన తీరును అందరూ దుయ్యబడుతున్నారు. నిబంధనల ప్రకారం పాజిటివ్ వచ్చిన ప్లేయర్‌ని ఐసోలేషన్ కి తరలించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగా టీమిండియా క్రికెటర్లు సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్ (కోవిడ్ సోకడంతో) ఆసీస్ తో తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే ఆస్ట్రేలియా మాత్రం కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో మెక్ గ్రాత్ ని పక్కనబెట్టే సాహసం చేయడానికి ఇష్టపడలేదు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 51 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులు, అలాగే బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టి సూపర్ ఫామ్ లో ఉండటమే ఇందుకు కారణం.





