
* సమర్థంగా ఎదుర్కొంటున్న భద్రతా బలగాలు
ఈశాన్య భారత్ లోని ఇండో – మయన్మార్ సరిహద్దుల్లోని పలు చోట్ల భద్రతా దళాలపై దాడులు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని అస్సాం రైఫిల్స్ శిబిరాలపై ఉల్ఫా-ఐ, ఎన్‌ఎస్‌సీఎన్ (నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్) మిలిటెంట్లు ఈ తెల్లవారు ఝామున దాడులు నిర్వహించారు.
ఆ రాష్ట్రంలోని చంగ్‌లాంగ్ జిల్లాలోని పంచుంగుపాస్ వద్ద అస్సాం రైఫిల్స్ సరికొత్తగా ఏర్పాటు చేసిన క్యాంప్ పై, అదే రాష్ట్రంలో నకనో అనే ప్రాంతంలో ఈ దాడులు చోటుచేసుకున్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన భద్రతా దళాలు ఎదురుదాడి చేపట్టాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ ఒక జవాను మరణించినట్లు వార్తలొస్తున్నాయి.
మరోవైపు నాగాలాండ్ చెరమోతలోని ఆర్మీ క్యాంపుపై మరో మిలిటెంట్ బృందం దాడి చేసింది. వీరు మోర్టార్లను ఉపయోగించి దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు ప్రాణనష్టంపై ఎటువంటి సమాచారం రాలేదు. ఈశాన్య భారత్ లోని పలు రాష్ట్రాల్లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని ఉల్ఫా – ఐ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ చీఫ్ పరేష్ బారువా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశాడు.
ఈ ఘటనపై ఉత్తర అస్సాంలోని తేజ్ పూర్‌లో ఉన్న రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ ఏఎస్ వాలియా స్పందించారు. మయన్మార్ సరిహద్దుల వెంట అస్సాం రైఫిల్స్ జవాన్లు గస్తీ నిర్వహిస్తుండగా మిలిటెంట్లు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. చంగ్‌లాంగ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక జూనియర్ కమీషన్డ్ అధికారి గాయపడినట్లు పేర్కొన్నారు.