
యానాదుల ధర్మ జాగరణ వేదిక, సింహపురి వైద్య సేవా సమితి (జై భారత హాస్పిటల్) నెల్లూరు ల సంయుక్త ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా శ్రీ వెంకయ్య స్వామి దివ్య క్షేత్రం గొలగమూడిలో ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి యానాదుల సమారాధన జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 10 వ తారీఖున సమారాధన మహోత్సవాలు గొలగమూడిలో జరుగనున్నాయి.
ఆ సందర్భంగా నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ నందు యానాదుల సమారాధనకు సంబంధించిన గోడ పత్రికలు (వాల్ పోస్టర్స్), కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా సింహపురి వైద్య సేవాసమితి అధ్యక్షులు పొన్నలూరు సీతారాం రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి యానాదుల సమారధన మహోత్సవం యానాదుల ధర్మజాగరణ వేదిక, సింహపురి వైద్య సేవా సమితుల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 వ తారీఖు శనివారం గొలగమూడి లో వెంకయ్య స్వామి పవిత్ర క్షేత్రంలో జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గోడపత్రికలు, కరపత్రికలను దత్తాత్రేయ పీఠం స్వామి దయానందతో కలిసి ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా స్వామి దయానంద మాట్లాడుతూ ధర్మం కోసం నిలబడే ప్రతి వ్యక్తి హిందువే అన్నారు. సింహపురి వైద్య సేవా సమితి ఉపాధ్యక్షులు శ్రీ బాలు సుబ్బారావు మాట్లాడుతూ యానాదుల ఆచార వ్యవహారాలను, వారి సాంస్కృతిక కార్యక్రమాలను బలపరిచేందుకు ప్రతి యానాది కాలనీకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథం వస్తుందని యానాది బంధువులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముడుపులు స్వీకరించి సెప్టెంబర్ 10వ తేదీ జరుగు యానాది సమారాధన కార్యక్రమంలో ముడుపులు చెల్లించగలరని కోరారు. గొలగమూడిలో సెప్టెంబరు 9, 10 తారీఖుల్లో యానాది బంధువుల కోసం మెగా ఉచిత కంటి పరీక్ష శిబిరం కూడా నిర్వహిస్తున్నారని అవసరమైన వారికి ఉచిత కంటి అద్దములు ఇస్తారని, ఉచిత కంటి ఆపరేషన్ లు చేస్తారని తెలిపారు. జయభారత్ ఆసుపత్రిలోనే ఆపరేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, శ్రీ గుర్రం సుధాకర్ రావు, శ్రీ గురు ప్రసాద్, యానాదుల ధర్మజాగరణ సమితి అధ్యక్షుడు శ్రీ ఏకశిరి వెంకటేశ్వర్లు, ఏపీ యానాదుల సంఘం జేఏసీ అధ్యక్షులు మాకాని వెంకటేశ్వర్లు, ఈగ రామయ్య, శ్రీరాములు, ప్రమీలమ్మ, మోపూరు వెంకటేశ్వర్లు, అద్దంకి అంకారావు , చేవూరు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు గురుస్వాముల చేతుల మీదుగా గోవింద దీక్షను స్వీకరించారు. అనంతరం స్వామి దయానంద శ్రీ వెంకటేశ్వర సమారాధన ప్రచార రథాన్ని ప్రారంభించారు.





