News

స్వాతంత్ర దినోత్సవ వేళ విధ్వంసానికి ఉగ్ర కుట్ర‌!

241views
  • అప్రమత్తమైన భద్రతా దళాలు

  • ప్రధాన నగరాల్లో కట్టుదిట్టమైన భద్రత

న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు, దాడులకు దిగే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.

ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉగ్రదాడులు జరిగే అవకాశాలపై 10 పేజీల రహస్య నివేదికను పంపింది. రెడ్ ఫోర్టు ప్రాంతంలో ప్రజల ప్రవేశాన్ని కట్టుదిట్టం చేయాలని ఐబీ సూచించింది.

ఇటీవల జపాన్ దేశంలో ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షింజోఅబేపై జరిపిన కాల్పులు, ఉదయపూర్, అమరావతి నగరాల్లో జరిగిన దాడుల ఘటనలను ఇంటెలిజెన్స్ ఉదాహరించింది. ఢిల్లీ పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఐబీ హైఅలర్ట్ ప్రకటించింది.

జనసమ్మర్ధ ప్రదేశాల్లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘా వేయాలని ఐబీ సూచించింది. ప్రధాన ప్రాంతాల్లో కీలక నాయకులపై దాడులు చేయాలని పాక్ ఐఎస్ఐ జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులను కోరినట్టు సమాచారం ఉందని ఐబీ తెలిపింది.

అఫ్ఘానిస్థాన్ ఉగ్రవాది నేతృత్వంలో లష్కరే ఖల్సా పేరిట పాక్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిందని, ఆ సంస్థ ఉగ్రవాదులు జమ్మూకశ్మీరులో పెద్ద ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందని ఐబీ వివరించింది.

ఢిల్లీలో రోహింగ్యాలు, ఆఫ్ఘానిస్థాన్, సుడాన్ దేశాల వాసులు నివాసం ఉంటున్న ప్రాంతాలపై ఢిల్లీ పోలీసులు నిఘా వేయాలని కోరారు. టిఫిన్ బాంబులతో కూడా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశమున్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ తన రహస్య నివేదికలో హెచ్చరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి