News

విద్యా వ్యవస్థలో ప్రధానాచార్యుల కృషి కీలకం : డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి

4views

నంద్యాలలోని స్థానిక శ్రీ రామకృష్ణా పీజీ కళాశాల ప్రాంగణంలో విద్యా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానాచార్యుల శిక్షణ తరగతుల సమారోప కార్యక్రమం ఘనంగా జరిగింది. మే 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సభ్యులు డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి, విద్యా భారతి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్రీ ప్రతాప్ సింహ శాస్త్రి, సంఘటన కార్యదర్శి శ్రీ భాస్కర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా వ్యవస్థలో ప్రధానాచార్యుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. విద్యారంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే విధంగా ప్రధానాచార్యులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

అనంతపురం సమితి పరిధిలోని శ్రీ సరస్వతి విద్యాపీఠం ఉన్నత పాఠశాలల ప్రధానాచార్యులకు సైన్స్ ల్యాబ్ పరికరాలను డాక్టర్ రామకృష్ణారెడ్డి అందజేశారు. విద్యార్థులు విజ్ఞానశాస్త్రాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకునేలా ప్రధానాచార్యులు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

కార్యక్రమంలో విద్యా భారతి కార్యకారిణి సభ్యులు శ్రీ మోహన్‌రావు, శ్రీ పర్చూరు రమేష్, నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో పాల్గొన్న ప్రధానాచార్యులకు జ్ఞాపికలను అందజేశారు.