News

అర్పితా జీవిత బీమా పాలసీల్లో పార్థా చట్టర్జీ నామినీ!

187views

కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్న టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కీలక నిందితురాలైన అర్పితాముఖర్జీ పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు జరుపుతున్న కొద్దీ ఆమె ఆర్ధిక కార్యకలాపాల గురించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ సినీనటి, మోడల్ అయిన అర్పితా ముఖర్జీ తీసుకున్న 31 జీవిత బీమా పాలసీల్లో నామినీగా పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థాచటర్జీ పేరు పెట్టారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

సినిమాల్లో, మోడలింగ్ రంగాల్లో రాణించిన అర్పితా ముఖర్జీకి సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. అర్పితాకు గతంలో జార్ గ్రామ్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం జరిగినా ఆమె భర్త పేరు వెల్లడించ లేదు. భర్త నుంచి విడిపోయిన తర్వాత అర్పితా ఎవరితో రిలేషన్ షిప్‌లో ఉన్నారో, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది వెల్లడించలేదు.

కాని అర్పితాకు చెందిన 31 ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా మాజీ మంత్రి పార్థాచటర్జీ పేరు పెట్టడంపై పలు రకాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాలసీల్లో నామినీ బాగోతం వెలుగు చూడటంతో పార్థా చటర్జీతో అర్పితా సహజీవనం చేస్తుందని అనుమానిస్తున్నారు.

పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీలిద్దరూ 2012వ సంవత్సరం జనవరి 1 వ తేదీన ఏపీఏ యుటిలిటీ సర్వీసెస్ కింద భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకున్నారు. వీరిద్దరి పేర్లపై కొన్న ఆస్తులపై ఈడీ విచారణ సాగిస్తోంది. పలు ఆస్తులు అర్పితా, పార్థా చటర్జీల పేరుతో కొనుగోలు చేసినా, దీనికి నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనేది తేలలేదు.

అర్పితా రూ 50 కోట్లకు పైగా నగదు, 5 కిలోల బంగారం, పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఈడీ అధికారుల సోదాల్లో దొరికాయి. మొత్తం మీద టీచర్ల రిక్రూట్ మెంటు స్కాంలో మాజీ మంత్రి పార్థా చటర్జీతోపాటు అర్పితా ముఖర్జీ పాత్ర కూడా ఉందని ఈడీ దర్యాప్తులో వెలుగుచూసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి