
-
కర్నాటక బీజేపీ ఏర్పాట్లు
-
గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నం
బెంగళూరు: ఆజాది కా అమృత మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో 75లక్షల నివాసాలపై జాతీయ పతాకం రెపరెప లాడనుందని బీజేపీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్ మీడియాతో మాట్లాడారు.
మొత్తం 224 శాసనసభ నియోజకవర్గాల్లోనూ ‘ఘర్ ఘర్ పర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తీర్మానించారు. కనీసం ఒక్కో నియోజకవర్గంలో 35వేల నివాసాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామన్నారు.
ఈ వేడుకలు బీజేపీ కార్యక్రమం కాదని స్పష్టం చేసిన ఆయన మతాలు, కులాలకు అతీతంగా ప్రజలంతా దేశ భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. అమృత మహోత్సవాల సందర్భంగా సైకిల్ జాథా, బైక్ జాథా, త్రివర్ణధ్వజం జాథాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈనెల 10నుంచి 11వరకు పథసంచలనం, ప్రభాత్ భేరి, మారథాన్, వాకథాన్, సైకిల్‌థాన్, భారతమాత పూజలు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భారతస్వాతంత్య్ర చరిత్రను తెలిపే 75 పుస్తకాలను ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు.
దేశవ్యాప్తంగా 20 కోట్ల నివాసాలపై ఈనెల 13నుంచి 15వరకు జాతీయ పతాకం రెపరెప లాడాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు కర్ణాటకలో భారీగా నిర్వహించాలని తద్వారా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించాలని తలపోస్తున్నామన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.