News

డేరింగ్ మ‌హిళ‌… తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ

441views

న్యూఢిల్లీ: చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి ఆసియా పర్యటన నేపథ్యంలో మంగళవారం రాత్రి తైవాన్‌లో అడుగుపెట్టారు. తైవాన్‌లో పెలోసి పర్యటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిన్‌పింగ్‌ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను హెచ్చరించినా ఆమె తైవాన్‌ పర్యటనకు రావడంతో రెండు అగ్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.

రెండు రోజుల క్రితం పెలోసి ఆసియా దేశాల పర్యటన ఖరారైనపుడు తైవాన్‌ ఊసు లేకపోవడంతో అమెరికా వెనక్కి తగ్గిందని భావించారు. కానీ, అనూహ్యంగా మంగళవారం రాత్రి పెలోసి తైపేలో కాలు పెట్టారు. పెలోసి ప్రయాణిస్తున్న విమానానికి తైవాన్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

తన భూభాగంగా చైనా చెప్పుకొంటున్న తైవాన్‌లో అమెరికాకు చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి పర్యటించడం గత 25 ఏళ్ళ‌లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దానితో అమెరికా, చైనా, తైవాన్‌లు తమ సేనలను మోహరించడంతో యుద్ధ మేఘాలు అలముకొంటున్నాయి.

అమెరికా వైమానికదళానికి చెందిన విమానంలో తైపే చేరుకున్న పెలోసికి తైవాన్‌ విదేశాంగ మంత్రి జోసెఫ్‌ వూ తైపే విమానాశ్రయంలో స్వాగతం పలికారు. `ఈ పర్యటన అమెరికాకు గౌరవప్రదం,’ అని పెలోసి వ్యాఖ్యానించారు. తైవాన్‌ ప్రజాస్వామ్యానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి