News

ప్రపంచానికి పెనుముప్పుగా మారిన‌ చైనా రాకెట్…అదుపు తప్పి భూమిపైకి దూసుకొస్తున్న శకలాలు

422views

న్యూఢిల్లీ: చైనా కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌కు సంబంధించిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. రాత్రి వేళ వివిధ రంగుల్లో మిరిమిట్లు గొలుపుతూ రాకెట్‌ శిథిలాలు భూమివైపు దూసుకొచ్చాయి.

తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల్లోని చాలా చోట్ల ప్రజలు వీటిని వీక్షించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీటిని ఉల్కాపాతంగా భావించి కొందరు వీడియోలు తీశారు. శనివారం రాత్రి 10 గంటల 45 నిమిషాల సమయంలో హిందూ మహాసముద్రంపై ఇవి భూవాతావరణంలోకి ప్రవేశించాయి.

అమెరికా స్పేస్‌ కమాండ్‌ కూడా ఇదే సమయంలో చైనా రాకెట్‌ శిథిలాలు భూ వాతావరణంలోకి చేరినట్టు నిర్ధారించింది. మలేసియా మీదుగా ఈ శకలాలు ప్రయాణిస్తున్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్‌ క్రిస్‌ హాడ్‌ఫీల్డ్‌ కూడా షేర్‌ చేశారు. వీటిలో ఎన్ని భూమిని తాకి ఉండొచ్చనే సందేహం వ్యక్తం చేశారు.

చైనా స్పేస్‌ ఏజెన్సీ పనితీరును నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ తప్పుపట్టారు. చైనా తన రాకెట్ల శిథిలాలు భూ వాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించే దేశాలు అత్యుత్తమ విధానాలను అనుసరించాలని సూచించారు. లాంగ్‌మార్చ్‌ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు ఆస్తి, ప్రాణ నష్టం కలగజేసే ప్రమాదం ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి