
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న రూ.20 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పార్థా ఛటర్జీ అనుచరుడు అర్పితా ముఖర్జీ నివాసంలో ఈ మొత్తం లభించింది. ఈడీ అధికారులు శుక్రవారం మంత్రి పార్థా ఛటర్జీ, విద్యా మంత్రి ప్రకాశ్ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, మరికొందరి నివాసాలపైనా ఏక కాలంలో దాడులు చేశారు.
పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన పి.కె.బందోపాధ్యాయ్, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్ళలోనూ సోదాలు జరిగాయి.
అనంతరం.. శనివారం ఉదయం కోల్కతాలోని పార్థా చటర్జీ నివాసానికి వెళ్ళి ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఆయన అనుచరుడు అర్పితా ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు.
అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన రూ.20 కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవేనని భావిస్తున్నట్టు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. నగదుతో పాటు 20కి పైగా సెల్‌ఫోన్లను అర్పితా ముఖర్జీ నివాసం నుంచి జప్తు చేసినట్లు తెలిపింది.
నేరాన్ని నిరూపించడంలో ఉపయోగపడే పత్రాలతో పాటు డొల్ల కంపెనీల వివరాలు, విదేశీ కరెన్సీ, బంగారం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కుంభకోణంతో సంబంధమున్న వ్యక్తుల వద్ద లభించాయని వెల్లడించింది.
కాగా, పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కోల్‌కతాలో టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది.
ఆ మరుసటి రోజే ఈడీ దాడులు చేయడం వెనుక తమ నాయకులను వేధించాలన్నదే ఈడీ వ్యూహంగా ఉందని స్పష్టమవుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, తృణమూల్ నేత ఫిర్హాద్ హకిమ్ ఆరోపించారు.
Source: EtvBharat





