News

మాఫియా ఘాతుకాలు… 24 గంటల్లో ముగ్గురు పోలీసుల హత్య!

466views

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయి. దీంతో 24 గంటల వ్యవధిలో ముగ్గురు పోలీసులు బ‌ల‌య్యారు. మృతుల్లో ఓ డీఎస్పీ, మహిళా ఎస్‌ఐ, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా గుజరాత్ ఆనంద్ ప్రాంతంలోని బోర్సాడ్ పట్టణం చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కానిస్టేబుల్ రాజ్‌కిరణ్‌ను హతమార్చారు.

తనిఖీ కోసం వాహనం ఆపమన్నా మరింత వేగం పెంచి అదే వాహనంతో ఢీ కొట్టించారు. తీవ్ర గాయాలపాలైన రాజ్‌కిరణ్‌ను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. మరో కానిస్టేబుల్ చికిత్స పొందుతున్నారు.

రాజస్థాన్‌కు చెందిన ఈ వాహనంలో కంపెనీల్లో వాడే రసాయన పౌడర్‌ను అక్రమంగా తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఫార్మా మాఫియా ఈ పౌడర్‌ను అనుమతుల్లేకుండా తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలింపు జరుపుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

మంగళవారం ఉదయం డీఎస్పీ సురేందర్ బిష్ణోయ్‌ను మైనింగ్ మాఫియా అతి దారుణంగా హతమార్చింది. అలాగే, బుధవారం ఉదయం జార్ఖండ్‌లోని రాంచీలో మహిళా ఎస్‌ఐ సంధ్యను ఆవుల అక్రమ రవాణా మాఫియా సభ్యులు కిరాతకంగా చంపేసిన సంఘ‌ట‌నలు విదిత‌మే.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి