
న్యూఢిల్లీ: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న తరుణంలోనే ఆయన దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మేల్కు పరారయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సైతం ధ్రువీకరించింది. మాల్దీవులు ప్రభుత్వం వెలనా విమానాశ్రయంలో రాజపక్సకు స్వాగతం పలికింది.
మరోవైపు, శ్రీలంక ప్రభుత్వ ఆదేశాల మేరకే అధ్యక్షుడిని తరలించామని ఆ దేశ వాయుసేన ప్రకటించింది. ఆయన సోదరుడు, ఆర్థికమంత్రి బసిల్ రాజపక్స సైతం దేశాన్ని విడిచి పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, గొటబాయ రాజపక్స రాజీనామాపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని పార్లమెంట్ స్పీకర్ తెలిపారు. గురువారం నాటికి రాజీనామా అందే అవకాశం ఉందని చెప్పారు.
మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు పారిపోయేందుకు భారత్ సహకరించిందన్న వార్తను అక్కడి భారత హైకమిషన్ ఖండించింది. మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు నిరాధారమైనవని తెలిపింది. శ్రీలంక సుస్థిర అభివృద్ధికి ఎల్లప్పుడూ భారత సహకారం ఉంటుందని స్పష్టం చేసింది.





