
* అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ ల సమావేశంలో శ్రీ అంబేకర్ ప్రకటన
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ ల సమావేశం రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లా ఖేమీ శక్తి మందిరం సమీపంలో జులై 7 నుంచి 9 వరకూ మూడు రోజుల పాటు జరిగింది. కరోనా కష్టకాలం తర్వాత జరిగిన ఈ సమావేశంలో, సంఘం నిర్వహించిన కార్యకలాపాల గురించి వివరించారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికలు, వాటి గతివిధుల గురించి చర్చించినట్టు అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు.
రెండేళ్ళ తర్వాత దేశ వ్యాప్తంగా నిర్వహించిన సంఘ శిక్షావర్గల వివరాలను తెలిపారు. వాటిలో 40ఏళ్ళ లోపు వయసు కలిగిన 18981 మంది పాల్గొన్నారు. అలాగే 40ఏళ్ళు పైబడిన వారు 2925 మంది పాల్గొన్నారు. ఈ యేడాది దేశవ్యాప్తంగా మొదటి, రెండవ, మూడవ ఏడాదులకు సంబంధించి 101 వర్గలు జరిగాయి. వాటిలో మొత్తం 21,906 మంది పాల్గొని శిక్షణ పొందినట్టు సునీల్ అంబేకర్ జీ ప్రకటించారు.
కరోనా వల్ల రెండేళ్ళుగా మందకొడిగా ఉన్న సంఘ కార్యకలాపాలు మళ్ళీ పుంజుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 56,824 శాఖలున్నాయి. సమాజ సేవలో భాగంగా స్వయంసేవకులు మంచినీటి సరఫరా, చెత్త ఏరివేత, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత వంటి కార్యక్రమాల్లో గణనీయంగా పాల్గొన్నారు. కుటుంబ విలువలు, సమాజహితం కోసం పని చేసే సామాజిక సంస్థలు, సాధుసంతులు, మఠాలు, మందిరాలతో కలిసి స్వయంసేవకులు ముందడుగు వేస్తున్నారని అంబేకర్ జీ వెల్లడించారు.

దేశానికి స్వతంత్రం వచ్చి 75ఏళ్ళయిన సందర్భంగా సమాజ జీవితంలోని అన్ని రంగాల్లోనూ దేశీయమైన ఆలోచనా ధోరణి పెంచడం, ఎలాంటి పేరు ప్రఖ్యాతులూ పొందకుండా అజ్ఞాతంగా ఉండిపోయిన దేశభక్తుల గురించి ప్రచారం చేయడానికి ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. వాటి కార్యక్రమాలకు విస్తారంగా ప్రచారం కలిగించవలసిన ఆవశ్యకత ఉంది. అఖిల భారతీయ ప్రతినిధి సభ మార్చి మాసపు సమావేశంలో స్వయం ఉపాధి అవకాశాల గురించి చర్చించారు. ‘స్వావలంబి భారత్ అభియాన్’లో భాగంగా 4వేల మందికి పైగా యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాల్లో శిక్షణ ఇచ్చారు. జులై 15 అంతర్జాతీయ యువ కౌశల దినం నుంచి ఆగస్టు 21 ఉద్యోజక్ దినం వరకూ ఈ విషయమై పలు కార్యక్రమాలు జరుగుతాయి.
సంఘకార్యం మొదలై 2025 నాటికి వందేళ్ళు నిండుతాయని సునీల్ అంబేకర్ గుర్తు చేశారు. ఆ శతాబ్ది సందర్భంలో నిర్వహించవలసిన పలు కార్యక్రమాల గురించి విస్తారమైన ప్రణాళిక రచించారు. 2024 నాటికి సంఘాన్ని దేశంలో లక్ష ప్రదేశాలకు చేరువ చేస్తామని ఆయన చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల వారికీ సంఘ కార్యం చేరువయ్యే విధంగా కష్టపడాలని వివరించారు. సమాజంలోని అన్ని వర్గాలకూ సంఘకార్యం చేరువ కావాలన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ సంఘం అంటే సమాజంలో ఒక సానుకూల వాతావరణం కనిపించాలన్నారు. సమావేశంలో గతేడాది సమీక్ష, రాబోయే రెండేళ్ళ ప్రణాళికల గురించి చర్చించారు.
ఇటీవల ఉదయపూర్ లో జరిగిన దారుణ హత్యను అంబేకర్ ఖండించారు. మనది ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగబద్ధమైన అధికారాలు అమల్లో ఉన్న దేశం. ఒకరు చెప్పిన మాటలు మరెవరికైనా నచ్చకపోతే ప్రజాస్వామిక పద్ధతిలో ఖండించాలి. అంతే తప్ప ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకూడదు. దేశం మొత్తం ఇలాంటి సంఘటనలను తప్పుపట్టాలి. హిందూ సమాజం మౌలికంగా శాంతిపూర్వకంగా, రాజ్యాంగ బద్ధంగా తమ ప్రతిక్రియ చేపట్టింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా నిషేధించాలని ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి సంఘటనలను సభ్య సమాజం ఒప్పుకోదు. హిందువులు తమ ప్రతిక్రియను శాంతిపూర్వకంగా రాజ్యాంగబద్ధంగా ప్రదర్శిస్తున్నారు. ఇవాళ ముస్లిం సమాజం సైతం అదే విధంగా ముందుకు రావాలి. ఎక్కడో ఒకరిద్దరు బైటకు రావడం కాదు. పెద్ద సంఖ్యలో బైటకు వచ్చి ఇలాంటి దుష్ట విధానాలను ఖండించాలి. అలాంటి సామూహిక కార్యక్రమాలే సమాజసేవకు, దేశ హితానికీ ఎంతో మంచివి అని శ్రీ అంబేకర్ చెప్పారు.





