
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ గా వ్యవహరించిన శ్రీ భరత్ కుమార్ ఇకమీదట దక్షిణ మధ్య క్షేత్రానికి (ఆంధ్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక) సహ క్షేత్ర ప్రచారక్ గా వ్యవహరించనున్నారు. అలాగే ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సహ ప్రాంత ప్రచారక్ గా వ్యవహరిస్తూ వచ్చిన శ్రీ విజయాదిత్య ఇక విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ గా వ్యవహరించనున్నారు. అలాగే ఇప్పటివరకూ విశాఖ, విజయనగరం విభాగ్ ల సంభాగ్ ప్రచారక్ గా వ్యవహరిస్తూ వచ్చిన శ్రీ జనార్ధన్ ఇకనుంచి విశాఖ కేంద్రంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి సహ ప్రాంత ప్రచారక్ గా వ్యవహరించనున్నారు.
ఈనెల 7, 8, 9 తేదీలలో రాజస్థాన్ లోని ఝున్ ఝునులో జరిగిన అఖిలభారత ప్రాంత ప్రచారకుల సమావేశాలలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సాయంత్రం అనగా 9వ తేది సాయంత్రం 4 గంటలకు ప్రకటించారు.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారి సంక్షిప్త పరిచయం :
శ్రీ భరత్ కుమార్ :

హైదరాబాద్ JNTU లో ఇంజనీరింగ్ పట్టభద్రులైన శ్రీ భరత్ కుమార్ బాల్యం నుంచి స్వయంసేవక్. ఇంజనీరింగ్ విద్య పూర్తయిన తర్వాత వారు విద్యుత్ శాఖలో A.E గా కొంతకాలం పని చేశారు. అనంతరం తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారక్ (పూర్తి సమయ కార్యకర్త) గా వచ్చారు. మొదట విజయవాడ మహానగర్ ప్రచారక్ గానూ, తర్వాత విజయవాడ విభాగ్ ప్రచారక్ గానూ అనంతరం రాజమండ్రి విభాగ్ ప్రచారక్ గానూ పని చేశారు. 2011 నుంచి 2013 వరకూ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి సహ ప్రాంత ప్రచారక్ గా పనిచేసిన శ్రీ భరత్ కుమార్ 2013 నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ గా ప్రభావవంతంగా పని చేశారు. ఇకనుంచి వారు దక్షిణ మధ్య క్షేత్రానికి సహ క్షేత్ర ప్రచారక్ గా సంఘ కార్య విస్తరణ కోసం పని చేస్తారు.
శ్రీ విజయాదిత్య :

వీరు కూడా బాల్యం నుంచి స్వయంసేవక్.1990 లో విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్ విద్య పూర్తయిన తర్వాత 1994 నుంచి సంఘ ప్రచారక్ గా పని చేస్తున్నారు. తిరుపతి, గుంటూరు, రాజమండ్రి విభాగ్ ల ప్రచారక్ గా పని చేసిన అనంతరం 2013 నుంచి 2016 వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రాంత శారీరిక్ ప్రముఖ్ గా వారు విశేషంగా పని చేశారు. 2016 నుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సహ ప్రాంత ప్రచారక్ గా వ్యవహరించిన శ్రీ విజయాదిత్య నేటి నుంచి విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ గా తన సేవలు అందించనున్నారు.
శ్రీ జనార్ధన్ :

1975 శ్రావణ పౌర్ణమి నాడు జన్మించిన శ్రీ జనార్ధన్, చిత్తూరు జిల్లా పలమనేరులో బి.ఏ పట్టభద్రులయ్యారు.1995 నుంచి నెల్లూరు జిల్లాలో ప్రచారక్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం తెనాలి, నరసరావుపేటలలో జిల్లా ప్రచారక్ గా పనిచేసి తిరిగి నెల్లూరు విభాగ్ ప్రచారక్ గా నియుక్తులయ్యారు. అనంతరం ముంబైలోని సాందీపని ఆశ్రమంలో వేదాధ్యయనం గావించారు. మళ్లీ తిరిగి విశాఖ విభాగ్ ప్రచారక్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ జనార్ధన్ ప్రస్తుతం విశాఖ, విజయనగరం (సంభాగ్) విభాగ్ లలో సంఘ కార్య విస్తరణకు కృషి చేస్తున్నారు. ఇకనుంచి వారు విశాఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సహ ప్రాంత ప్రచారక్ గా తమ సేవలు అందించనున్నారు.





