News

రేప‌టి నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం: కేంద్రం వెల్లడి

431views

న్యూఢిల్లీ: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై దేశవ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమలులోకి రానున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నోటీఫై చేసింది. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడం, సరఫరా, అమ్మకంతోపాటు వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిషేధిత జాబితాలో ఏయే వస్తువులు ఉన్నాయో తెలియజేస్తూ తాజాగా ప్రకటన జారీ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నిషేధాన్ని అమలులోకి తెస్తున్నట్టు పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. పెట్రో కెమికల్‌ సంస్థలు కూడా ప్లాస్టిక్‌ ముడిసరకును వస్తువులను తయారుచేసే పరిశ్రమలకు సరఫరా చేయవద్దని ఉత్తర్వులు జారీచేసింది. ఏ వాణిజ్య సంస్థ తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ ఉపయోగించరాదని షరతు విధిస్తూ స్థానిక సంస్థలు లైసెన్సులు జారీచేయాలని, ఒకవేళ ఎవరైనా ఉపయోగించినా, లేదంటే నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించినా వాటి లైసెన్సులు రద్దు చేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీచేసింది. ప్లాస్టిక్‌ నిషేధం సమర్థంగా అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి