
గువాహటి: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం గువాహటిలోని ఓ లగ్జరీ హోటల్‌లో తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలతో పాటు ఉన్న శివసేన రెబల్ ఏక్‌నాథ్ షిండే తాజాగా కీలక ప్రకటన చేశారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. త్వరలో రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముంబైకి వెళ్ళనున్నట్టు షిండే ప్రకటించడం గమనార్హం. తాము శివసేనలోనే ఉన్నామని, శివసేనను ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశంతోనే ఉన్నామని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని షిండే మీడియాకు తెలిపారు. త్వరలో తాను ముంబై వెళ్ళనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
గువాహటిలో తనతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. త్వరలోనే తాను ముంబై వెళ్ళి గవర్నర్‌ను కలుస్తానని షిండే స్పష్టం చేశారు. రెబల్ ఎమ్మెల్యేల్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారాన్ని ఏక్‌నాథ్ షిండే కొట్టిపారేశారు. రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత నోటీసులపై స్పందించేందుకు జులై 12 వరకూ సుప్రీం కోర్టు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం లేదు.
Source: NationalistHub





