News

కర్ణాటకలో సంవాద విలేఖ‌రిపై దాడి… నిందితుల అరెస్టుకు ప‌లువురి డిమాండ్‌!

405views

బెంగళూరు: ‘సంవాద’ ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్ తేజ ఈ నెల 18న తిమ్మప్ప ఫ్రీడం పార్క్‌లో కర్ణాటకలో పాఠ్యపుస్తకాల సవరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనను కవర్ చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజ‌ర‌య్యారు. సంకుచిత, భాషా ఆధారిత రాజకీయాలకు పాల్పడే గ్రూపులు ఈ నిర‌స‌న చేప‌ట్టాయి. అయితే, కార్య‌క్ర‌మాన్ని క‌వ‌ర్ చేస్తున్న విలేఖ‌రి తేజపై ఒక్క‌సారిగా ఆ గ్రూప్‌లు దాడికి పాల్ప‌డ్డాయి. విలేఖ‌రి దుస్తులు చింపి, కుల దూషణలు చేశారు. అతను వారి భావజాలానికి భిన్నంగా ఉన్న మీడియా ఛానెల్‌కు ప్రాతినిధ్యం వ‌స్తుండ‌డంతో ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. కొద్దిసేప‌టి త‌ర్వాత పోలీసులు క‌ల్పించుకుని తేజ‌ను ర‌క్షించారు. బాధితుని ఫిర్యాదు మేర‌కు నిందితుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.‘రణధీర పాడే’ అనే సంస్థకు చెందిన ప్రధాన నిందితులు హరీష్ భైరప్ప, దీపుగౌడలు పరారీలో ఉన్నారు.

కాగా, ఈ దాడిని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్టు ఆయన తన ట్వీట్‌లో తెలిపారు. బాధిత జర్నలిస్టుకు తన నైతిక మద్దతును కూడా అందించాడు. అలాగే, సంవాద జర్నలిస్టుపై దాడికి నిర‌స‌న‌గా 23వ తేదీన ఫ్రీడమ్ పార్క్ వద్ద ‘సమరస్య వేదిక, కర్ణాటక’ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో వివిధ సామాజిక సంస్థలు, వివిధ రంగాలకు చెందిన పౌరులు పాల్గొన్నారు. సంవాద జర్నలిస్టుపై దాడిని, పత్రికా స్వేచ్ఛపై, భావప్రకటనా స్వేచ్ఛపై దాడిని నిరసనకారులు నిలదీశారు. అలాగే పరారీలో ఉన్న నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర‌స‌నలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వివేక్ సుబ్బారెడ్డి, శ్రీ టాక్స్ చీఫ్ శ్రీలక్ష్మీ రాజ్‌కుమార్, అఖిల భారతీయ దళిత క్రియా సమితి రాములు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి