విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ముగ్గురిని విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో హాజరుపరిచింది. ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తమ కుమార్తెను అపహరించి మావోయిస్టులలో కలిపారంటూ ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేసింది. నర్సింగ్ విద్యార్ధినిగా ఉన్న తమ కుమార్తె రాధను కొందరు కుట్రపూరితంగా మావోయిస్టు ఉద్యమంలోకి పంపారంటూ హైదరాబాద్ కాప్రాకు చెందిన పల్లెపాటి పోచమ్మ గత జనవరిలో విశాఖపట్నం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పెదబయలు పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న తమ కుమార్తెను చైతన్య మహిళా సంఘానికి చెందిన దొంగరి దేవేంద్ర, దుబాసీ స్వప్న, చుక్క శిల్ప తదితరులు తరచూ కలుస్తూ ఉండేవారని, మావోయిస్టు భావజాలం ఒంట బట్టించారని పోచమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Source: EtvBharat