జమ్ముకశ్మీర్: ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరోసారి కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో దాడులు జరిపింది. జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సహకారంతో హబ్బా-కాదల్, సూత్రషహి ఏరియాలో ఈ దాడులు చేపట్టింది. హబ్బా కాదల్ నివాసి నజీర్ అహ్మద్, సూత్రసహిలో ఉంటున్న షా ఫైజల్ అనే వ్యక్తిని ఎన్ఐఏ నిర్బంధంలోకి తీసుకుని శ్రీనగర్‌లోని షహీద్ జుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లింది. అనంతరం, స్కిమ్స్ (ఎస్‌కేఐఎంఎస్) సౌర ఆసుపత్రిపై దాడి జరిపి ఇర్షాద్ అహ్మద్ ఎలాహి అనే 24 ఏళ్ల యువకుడిని అదుపులోనికి తీసుకుంది.
పుల్వామా, బారాముల్లాలో..
కాగా, రెండ్రోజుల క్రితం కూడా పుల్వామా జిల్లాలో ఎన్ఐఏ దాడులు జరిపి పలువురిని నిర్బంధంలోకి తీసుకుంది. పుల్వామాలోని దరస్‌గఢ్ ప్రాంతంలో గత మార్చి11న భద్రతా దళాలపై దాడి జరిగింది. దానిపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ తాజాగా దాడులు జరిపింది. ఈనెల 16న కూడా బారాముల్లా జిల్లాలో ఎన్ఐఏ రెయిడ్స్ జరిపింది. సీఆర్‌పీతో కలిపి జరిపిన ఈ దాడుల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్లను సీజ్ చేసింది.