
ముంబై: ముఖ్యమంత్రి పదవిపై తనకు మోజు లేదన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘వర్షా’ను ఖాళీ చేసి ఆయన సొంత గృహమైన ‘మాతోశ్రీ’కి చేరుకున్నారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి నుంచి శివసేన బయటకు రావాల్సిందేనని ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పిన తర్వాత ఈ పరిణామం జరిగింది. అంతకముందు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై తొలిసారి ఫేస్‌బుక్ లైవ్ నిర్వహించిన ఉద్ధవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
సొంత పార్టీ నేతలే తనను ముఖ్యమంత్రిగా వద్దనుకుంటే.. ఆ విషయం తనతో చెప్పాలని సూచించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అనంతరమే ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సొంతింటికి వెళ్లిపోయారు. బుధవారం తెల్లారేసరికల్లా సూరత్ నుంచి గౌహతి చేరుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేనే తమ నాయకుడని ప్రకటించారు. తమదే అసలైన శివసేన అంటూ తీర్మానం చేసి, గవర్నర్‌కు లేఖను పంపారు.
Source: Nijamtoday





