
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. రైల్వే కేసుల్లో శిక్ష పడ్డవారికి భవిష్యత్‌లో ప్రభుత్వోద్యోగాలు రావని స్పష్టం చేశారు. సుమారు రెండు వేల మంది ఆందోళనకారులు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారని పేర్కొంటూ వారిని కొందరు రెచ్చగొట్టారని వివరించారు.
ఈ నెల 17న జరిగిన విధ్వంసకాండకు సంబంధించి ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె పలు విషయాలను వెల్లడించారు. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు రైల్వేస్టేషన్ మూడో గేటు నుంచి 300 మంది దాకా వచ్చారని, వారి చేతుల్లో కర్రలు, రాడ్లు ఉన్నట్లు, కొందరు పెట్రోల్ బాటిళ్లతో వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా ఉందని తెలిపారు.
‘‘9.30కల్లా మొత్తం రెండు వేల మంది జమయ్యారు. వీరంతా తెలంగాణ వారే. రాతపరీక్ష కోసం ఎదురుచూస్తున్నవారే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సీసీ కెమెరాలు, స్టాళ్లు, డిస్‌ప్లే బోర్డులను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫాంలపై ఈస్ట్‌కోస్ట్, అజంతా, దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. నాలుగు బోగీలకు నిప్పంటించారు. 58 అద్దాలను పగులగొట్టారు. రైళ్లలో ఉన్నవారు భయంతో బయటకు వెళ్లిపోయారు’’ అని అనురాధ వివరించారు.
ఆందోళనకారులను అడ్డుకునేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసు(జీఆర్‌పీ) బృందాలు ప్రయత్నించాయని, కానీ వారు పట్టాలపై ఉన్న రాళ్ళతో వారిపై దాడులు చేశారని ఆమె తెలిపారు.
Source: Nijamtoday





