-
పాకిస్తాన్ తీవ్రవాదిని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలనే భారత ప్రతిపాదనను అడ్డుకున్న వైనం
-
ఐరాసలో భారత్, అమెరికా ఉమ్మడి తీర్మానాన్ని వీటో చేసిన చైనా
న్యూఢిల్లీ: మరోసారి తన భారత వ్యతిరేకతను చైనా బయటపెట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదిని, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఐక్యరాజ్యసమితిలో మోకాలడ్డు పెట్టింది.
యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్‌లో ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద పాక్ ఉగ్రవాద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ‘ గ్లోబల్ టెర్రరిస్ట్’గా గుర్తించాలని భారత్, యూఎస్ఏ చేసిన ప్రతిపాదనను చైనా తన వీటో పవర్‌తో అడ్డుకుంది.
అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్, 26/11 ముంబై పేలుళ్ళ మాస్టర్ మైండ్ హఫీస్ సయూద్‌కు స్వయానా బామమరిది. యూఎన్ఓ లో 1267 ఐసిస్, ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింది మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించాలని పెట్టిన ప్రతిపాదనలను చివరి నిమిషంలో చైనా నిలిపివేసింది. గతంలో కూడా చైానా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలచింది. పలువురు ఉగ్రవాదులను గ్లోబల్ టెర్రిరిస్టులుగా గుర్తించేందుకు అంగీకరించలేదు. ఐరాస శాశ్వత సభ్యదేశాలకు ఉండే వీటో అధికారంలో ఈ ప్రక్రియను అడ్డుకుంది.
గతంలో కూడా చైనా, పాక్ ఉగ్రవాది జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో కూడా ఇలానే చేసింది. అయితే, నాలుగు సార్లు ప్రయత్నించిన తర్వాత మసూద్ అజహర్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించారు. 2016లో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి, పుల్వామా దాడిలో ఇతను కీలకంగా వ్యవహరించాడు. గతంలో 2010లో యూఎస్ ట్రెజరీ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా పేర్కొంది. దీంతో యూఎస్ లో ఎలాంటి లావాదేవీలు నడపకుండా మక్కీని నిషేధించారు.
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ మక్కీ గురించి సమాచారం అందించిన వారికి 2 మిలియన్ డాలర్ల రివార్డ్ అందిస్తామని ప్రకటించింది. అబ్దుల్ రెహ్మన్ మక్కీ ప్రస్తుతం లష్కరే తోయిబాలో విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, నిధుల సేకరణలో కీలకంగా వ్యహరిస్తున్నట్టు తెలుస్తోంది.