
బెంగళూరు: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఒకరిని కశ్మీర్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా కర్ణాటక పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్‌కు చెందిన తాలిబ్ హుస్సేన్ రెండేళ్ళుగా బెంగుళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి శ్రీరాంపుర ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
చుట్టుపక్కల వ్యక్తులకు కూడా అనుమానం లేకుండా ఉగ్రవాద సంస్థ తరఫున అతను కార్యకలాపాలను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. జమ్మూకశ్మీర్ పోలీసులు వారం రోజుల క్రితం బెంగళూరు వచ్చి ఈ కేసుకు సంబంధించిన సమాచారం సీనియర్ పోలీసులకు అందించారు. అతని ఇంటిని కనిపెట్టే విషయంలో బెంగళూరు పోలీసుల సాయం తీసుకున్నారు.
ఈనెల మూడోతేదీన సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి తాలిబ్ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు ఉన్నతాధికారుల వివరాల ప్రకారం, హుస్సేన్‌కు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఒకామె జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో ఉంటోంది. మరో ఆమె బెంగళూరులో అతనితో కలిసి ఉంటోంది.
కిష్ట్వార్ నివాసి అయిన హుస్సేన్ ఆటో డ్రైవర్‌గా రెండేళ్ళుగా బెంగళూరులో ఉంటున్నప్పటికీ అతని గురించిన సమాచారం అతని పొరుగువారికి కానీ, ఇంటి యజమానికి కానీ తెలియదని పోలీసులు చెప్పారు. హుస్సేన్ 2016లో హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలో చేరి, యువకులను రిక్రూట్ చేస్తూ వచ్చేవాడని పోలీసులు అంటున్నారు.
Source: Nijamtoday





