
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ళలో దేశానికి సుపరిపాలన అందించారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సేవ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పలు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపింది. మోదీ ప్రధాని పీఠమెక్కాక చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కేంద్రం వంద పేజీల కరపుస్తకాన్ని విడుదల చేసింది.
‘8 ఏళ్ళలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం’ అనే పేరుతో రూపొందించిన ఈ పుస్తకంలో.. వివిధ అంశాల్లో గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాను వివరించింది. ‘‘సులభతర జీవనం ప్రతి పౌరుడి హక్కు. అందుకే దానికి మా ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. దేశ ఆర్థిక పరిస్థితులను మార్చడానికి, ప్రజల జీవన ప్రమాణాల నాణ్యతను పెంచి వారి సామాజిక జీవితాన్ని మెరుగుపరచడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ ఈ ప్రభుత్వం వదులుకోదు’’ అంటూ పుస్తకానికి ప్రధాని ముందుమాట రాశారు.
సులభతర జీవనం, వైద్యం-ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన సహా మొత్తం 14 విభాగాల్లో మోదీ సర్కారు సాధించిన విజయాలను ఇందులో ప్రస్తావించారు. గత ప్రభుత్వానికి, తమ సర్కారుకు మధ్య తేడాను చాటిచెప్పే ప్రయత్నం చేశారు.





