
రాష్ట్రంలో మెడికల్ మినహా వృత్తి విద్యాకోర్సుల ఎంపిక కోసం జరిగే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ)లకు విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధించారు. రాష్ట్ర పరీక్షా ప్రాధికార సంస్థ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎస్ఎల్‌సీ, పీయూసీ పరీక్షల్లో అమలు చేసిన తరహాలోనే హిజాబ్ లేకుండా పరీక్షల్లో పాల్గొనాలని ఆదేశించింది. జూన్ 16 నుంచి మూడు రోజుల పాటు సీఈటీలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షా ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు ఆదేశాలను సీఈటీలోనూ అమలు చేయాలని విద్యాశాఖకు సూచించింది. దీంతో పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు హిజాబ్ తోపాటు ఏ విధమైన ధార్మిక భావనలు కలిగే దుస్తులు ధరించరాదని స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావడంపై పూర్తిగా నిషేధం ఉంటుందని, గడియారాలు, ఆభరణాలు కూడా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. తాగునీరు మినహా మిగిలిన ఎటువంటి వస్తువులకైనా నిషేధం తప్పదన్నారు.





