మే నెల 25న విజయవాడ, నూజివీడు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం పురవీధులలో హనుమాన్ శోభాయాత్రలు శోభాయమానంగా జరిగాయి. విజయవాడలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 6000 బైకులతో జరిగిన ఈ ర్యాలీలో 10000 మంది హనుమద్భక్తులు పాల్గొన్నారు. అన్ని చోట్లా కాషాయ జెండాలతో, జైశ్రీరామ్ నినాదాలతో, భక్తుల వీరోచిత ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ హనుమాన్ శోభాయాత్ర ప్రజలను ఎంతగానో అలరించింది. సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పక్షాల నుంచి సైతం ప్రజలు ఈ శోభాయాత్రలలో పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.
హైలైట్స్ :
విజయవాడలో…
విజయవాడ పురవీధులలో వేలాది మందితో జరుగుతున్న హనుమాన్ శోభాయాత్ర ఓ పుచ్చకాయలమ్మే మహిళను ఎంతగానో ఆకట్టుకుంది. జైశ్రీరామ్ నినాదాలతో, హనుమంతుని విగ్రహాలతో కోలాహలంగా సాగిపోతున్న యాత్రను చూసి ఆమె భక్తి పారవశ్యానికి లోనయింది. యాత్రలో వెళుతున్న యువకులను పిలిచి ఆమె తన వద్ద ఉన్న పుచ్చకాయలను కోసి ఆ ముక్కలను ఆనందంగా పంచింది. అలా ఆమె ఎన్ని పుచ్చకాయలను కోసి పంచిందో ఆమె లెక్కించనేలేదు. చూస్తుండగానే ఆమె దగ్గరున్న కాయలన్నీ అయిపోయాయి. అన్ని కాయలను అంతమందికి ఆమె చాలా వేగంగా కోసి ముక్కలను పంచారు. ర్యాలీలో పాల్గొన్న వారందరూ ఆమె భక్తికి ఫిదా అయిపోయారు. చేతులెత్తి మొక్కారు.
గన్నవరంలో…
గన్నవరంలో సుమారు 200 బైకులతో సాగిన శోభాయాత్ర స్థానికులను అలరించింది. స్థానిక భువనేశ్వరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామి యాత్రను జెండా ఊపి ఆరంభించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం భక్తులను ఆకట్టుకుంది.
దివిసీమలో…
ఇక దివిసీమలో అయితే సుమారు రెండు వేల బైకులతో 35 కిలోమీటర్ల పాటు యాత్ర సాగింది. ఆ యాత్ర అవనిగడ్డ చుట్టుప్రక్కల ఉన్న సుమారు 15 గ్రామాలను చుట్టి రావడం విశేషం. అవనిగడ్డ పుర ప్రజల తో పాటుగా యాత్ర సాగిన 15 గ్రామాల ప్రజలు కూడా ఆనందోత్సాహాలతో యాత్రను స్వాగతించటమే కాక, యాత్రలో కూడా ఉత్సాహంగా పాలుపంచుకోవటంతో యాత్ర ఆరంభంలో కంటే ముగింపు సమయానికి ఎక్కువ బైకులు, జనాభా కనిపించారు.
నూజివీడులో…
నూజివీడు లాంటి చిన్న నగరంలో సైతం సుమారు 700 బైకులతో యాత్ర జరగడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది.
గుడివాడలో…
అన్ని చోట్లా బైక్ యాత్రలు జరిగితే గుడివాడలోని హిందూ సంస్థల కార్యకర్తలు మాత్రం పాదయాత్రను సంకల్పించారు. అనుకున్న మేరకు ఎనిమిది వందల మందితో పాదయాత్ర వైభవంగా జరిగింది.