
-
సమావేశంలో సంయుక్త తీర్మానం విడుదల
టోక్యో : జపాన్లోని టోక్యో వేదికగా సమావేశమైన క్వాడ్ దేశాధినేతలు.. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. పాక్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు చేసే దాడులను, హింసాత్మక తీవ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి ఎటువంటి చట్టబద్ధత లేదని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఆమోదించలేమని అన్నారు. ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరించడం, ఆర్థిక, సైనిక, లాజిస్టిక్ సదుపాయాల విషయంలో సహాయం చేయడాన్ని ఖండించారు. ఇతరదేశాలపై దాడులు చేసేందుకు అఫ్గాన్ భూభాగాన్ని వినియోగించకూడదని దేశాధినేతలు స్పష్టం చేశారు.
సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రదాడులకు సహకరించడం, సైనిక, ఆర్థిక సహాయం అందించడాన్ని ఖండిస్తున్నాం. 26/11 ముంబయి దాడులు, పఠాన్కోట్ దాడులను ఖండిస్తున్నాం. ఉగ్రవాదులకు నిధులు అందకుండా అంతర్జాతీయ నిబంధనలకు అమలు చేయడాన్ని కొనసాగిస్తాం. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకుంటూ.. గ్లోబల్ టెరరిజంపై పోరును కొనసాగిస్తాం.” అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
చైనాకూ పరోక్ష హెచ్చరికలు చేశారు క్వాడ్ దేశాధినేతలు. ఇండో పసిఫిక్లో యథాతథ స్థితిని మార్చడానికి ఎలాంటి ఏకపక్ష ప్రయత్నాలు చేయకూడదని స్పష్టం చేశారు. సమస్యలను శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఘర్షణాత్మక ప్రాంతాల్లో సైనికీకరణకు ప్రయత్నాలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.





