News

ప్రపంచ చెస్ ఛాంపియన్‌ను రెండోసారి ఘోరంగా ఓడించిన భార‌తీయుడు!

297views

న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు మరోమారు సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్లస్‌ పై ఈ ఏడాది రెండోసారి విజయం సాధించాడు. చెస్సబుల్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంటులో శుక్రవారం 16 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ చాంపియన్ కార్ల్‌సన్‌తో ఐదో రౌండ్‌లో తలపడ్డాడు.
ఇద్దరూ నువ్వా? నేనా? అన్నట్టు తలపడడంతో మ్యాచ్ డ్రా కావడం ఖాయమని అనిపించింది. అయితే, చివర్లో కార్ల్‌సన్ 40వ మూవ్‌లో చేసిన పొరపాటును సద్వినియోగం చేసుకున్న ప్రజ్ఞానంద విజయం సాధించాడు.  దీంతో 12 పాయింట్లతో నాకౌట్ దశకు మరింత దగ్గరయ్యాడు.

ప్రజ్ఞ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతుండగా, కార్ల్‌సన్ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా, ఫిబ్రవరిలోనూ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించాడు. ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఆన్‌‌లైన్ ర్యాపిడ్ చెస్ టెర్నమెంటులో ఎనిమిదో రౌండ్‌లో భారత గ్రాండ్ మాస్టర్ చేతిలో కార్ల్‌సన్ ఓటమి పాలయ్యాడు. కార్ల్‌సన్‌పై విజయం సాధించిన అనంతరం ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. తాను పరీక్షలకు హాజరవుతున్నట్టు చెప్పాడు.

తన ప్రదర్శనపై పెదవి విరిచాడు. ఈ విజయం తనకు సంతోషం కానీ, థ్రిల్ కానీ ఇవ్వలేదన్నాడు. మ్యాచ్ సందర్భంగా కొంత స్టఫ్, కొన్ని ట్రిక్స్, మరికొన్నివ్యూహాలను మిస్సయినట్టు పేర్కొన్నాడు. తాను మరింతగా పదును తేలాలని చెప్పుకొచ్చాడు. ప్రజ్ఞానంద చేతిలో ఓటమి పాలైన కార్ల్‌సన్ ఈసారి అమెరికాకు చెందిన 13 ఏళ్ళ‌ అభిమన్యు మిశ్రాతో తలపడతాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి