
-
పురాతన ఆలయంలో చోరీకి గురైన విగ్రహాలు తిరిగి ప్రత్యక్షం
-
తప్పు చేశాం…క్షమించండి అంటూ లేఖ రాసిన దొంగలు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో దేవుడి మహిమ వెలుగులోకి వచ్చింది. చారిత్రక ఆలయ విగ్రహాలు చోరీ చేసిన నిందితులు.. అనంతరం తమను పీడకలలు వేధిస్తున్నాయని పేర్కొంటూ వాటిని తిరిగి ఆలయ పూజారి ఇంటి సమీపంలో వదిలేయడం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం..
చిత్రకూట్ జిల్లా తరౌనాలోని పురాత బాలాజీ ఆలయంలో ఈ ఘటన జరిగింది. చిత్రకూట్ తరౌనాలోని పురాతన బాలాజీ ఆలయంలో సౌకర్యాలు సరిగా లేక భక్తుల రాకపోకలు కూడా తగ్గాయి. ఇదే అదనుగా భావించిన ఓ దొంగల ముఠా ఆ చారిత్రక ఆలయంలో చోరీకి పాల్పడింది. బాలాజీ ఆలయం నుంచి మే తొమ్మిదోతేదీ రాత్రి రూ.కోట్ల విలువైన 16 విగ్రహాలు దొంగతనానికి గురయ్యాయి. మరుసటిరోజు ఆలయం తెరిచిచూసి షాకైన పూజారి మహంత్ రామ్‌బాలక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అద్భుతం జరిగిందా? అన్నట్టుగా దేవుడి విగ్రహాలు తిరిగి ప్రత్యక్షం అయ్యాయి..పురాతన బాలాజీ ఆలయం నుంచి చోరీకి గురైన విగ్రహాలు తిరిగి ఆలయ అర్చకుడిని చేరుకున్నాయి.
పూజారి మహంత్ నిద్రలేచేసరికి ఆయన ఇంటికి సమీపంలో ఒక గోనె సంచిలో విగ్రహాలు లభ్యమయ్యాయి. వాటితోపాటు ఓ లేఖ కూడా బయటపడినట్టు అధికారి తెలిపారు. ‘దొంగతనం చేసిన రాత్రి నుంచి పీడకలలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. వారం రోజులుగా నిద్రపడితే ఒట్టు. ఈ భయంతో మేం బతకలేం. అందుకే విగ్రహాలను తిరిగిస్తున్నాం’ అని దొంగలు వదిలిన లేఖలో రాసుంది.
మొత్తానికి చోరీకి గురైన విగ్రహాల్లో రెండు తప్ప మిగతావన్నీ తిరిగి ఆలయాన్ని చేరడంతో మళ్ళీ పూజలు కొనసాగుతున్నాయి. కాగా, ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.





