
యాదాద్రి: యాదాద్రి – భువనగిరి జిల్లా మధిర గ్రామం కాశీపేటలో ఒక చిన్నరాతి గుట్ట మీద పది వేల ఏళ్ళకుపైబడిన మధ్యరాతియుగం చిత్రాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ శుక్రవారం తెలిపారు.
వాటిని మొదట తమ బృందం సభ్యులు మహమ్మద్ నజీర్, కొరివి గోపాల్ గుర్తించారని చెప్పారు. 30 అడుగుల ఎత్తున్న చిన్నరాతి గుట్టమీద పడిగెరాయి లోపలివైపు ఎరుపురంగులో రాతి చిత్రాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
అక్కడి గుహను స్థానికులు వెంకటేశ్వరాలయంగా పిలుస్తారు. కొన్నేళ్ళుగా పండగలు, పర్వదినాలలో గుహ అంచులకు జాజు, సున్నం పూయడంతో రాతిచిత్రాలు మరుగునపడ్డాయని తెలిపారు. నాలుగు అడవి దున్నలు, ఇద్దరు పురుషులు, మరొక చోట గుర్రాన్ని పోలిన జంతువుల రాతిచిత్రాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. ఈ బొమ్మల్లోని రేఖల ఆధారంగా ఈ చిత్రాలు పది వేల ఏళ్ళ కంటే ముందునాటి మధ్యరాతియుగానికి చెందినవిగా అభిప్రాయపడుతున్నారు.





