విజయవాడ సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 11 వ తేదీన విద్యాభారతి ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి ఆచార్య ప్రశిక్షణా వర్గ (శిక్షణా శిభిరం) ప్రారంభమయ్యింది. ఈ నెల 30వ తారీఖు వరకు ఈ వర్గ జరుగనున్నది.
ఈ వర్గలో ఈ రోజు అనగా 15/5/2022 ఆదివారం నాడు సంస్థలో పనిచేసే ఆయాలు మరియు వంటావిడతో జ్యోతి ప్రజ్వలన గావించటం ప్రధాన ఆకర్షణగా నిలచింది. ఈ విధంగా తమను వేదిక ఎక్కించి, తమ చేత జ్యోతి ప్రజ్వలన గావించటంపై వారు హర్షాన్ని వ్యక్తం చేశారు.
విద్యాభారతి దేశ వ్యాప్తంగా విలువలు, సంస్కారంతో కూడిన విద్యనందిస్తూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నది. 20 రోజులపాటు సాగే ఈ శిక్షణ శిబిరంలో విద్యాభారతి క్షేత్ర సంఘటనా కార్యదర్శి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి, విద్యాభారతి ఏపీ సహకార్యదర్శి శ్రీ కొమరిగిరి వెంకట ఆనంద్, విద్యా భారతి కోశాధికారి శ్రీ సన్నిధి సుబ్బారావు తదితరులు పాల్గొని మార్గదర్శనం చేస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీ లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తాము దేశ వ్యాప్తంగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించే విధంగా విలువలతో పాటు సంస్కారం, సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రతీ ఏటా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు శిక్షణ మెళకువలను తెలియచేసేందుకు 20 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఇక్కడ నేర్చుకున్న అంశాలను, క్షేత్రస్థాయిలో అమలు చేసి విద్యార్థులలో విలువలను, సంస్కారాన్ని, నైపుణ్యాలను మెరుగు దిద్దాలని శ్రీ సుధాకర్ రెడ్డి ఆచార్యులకు సూచించారు.
ఇంత మంచి కార్యక్రమం తమ విజ్ఞాన విహార పాఠశాలలో ఏర్పాటు చేయటం పట్ల పాఠశాల కార్యదర్శి శ్రీ గోవిందరావు, ప్రిన్సివల్ శ్రీ షణత్కృష్ట సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన విద్యాభారతి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.