
నెల్లూరు: నెల్లూరులో పోస్టుమార్టం చేసేందుకు లంచం అడిగిన డాక్టర్ సంధాని బాషాను విధుల నుండి తొలగిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ఉదయగిరి సీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ బాషా.. శవానికి పోస్టుమార్టం చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనకు సంబంధించి నెల్లూరు డీసీహెచ్ఎస్ ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసి, వివరాలను ప్రభుత్వానికి అందజేశారని మంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా డాక్టర్ బాషాను తక్షణమే విధుల నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. అంతేకాకుండా.. తదుపరి విచారణ పూర్తి అయ్యేంత వరకూ హెడ్ క్వార్టర్‌ను వదిలి వెళ్ళొద్దని బాషాను ఆదేశించినట్టు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Source: EtvBharat





