
యాదగిరిగుట్ట: అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక పుణ్యక్షేత్రం అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా రూ.1280 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల డొల్లతనం ఒక్కవానకే బయటపడింది! బుధవారం వేకువజామున ఈదురు గాలులతో కురిసిన భారీ అకాల వర్షానికి యాదాద్రి అతలాకుతలమైంది.
లక్ష్మీనరసింహస్వామి కొలువైన గర్భాలయం మినహా.. కొండపైన, కొండకింద ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రాంతాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ప్రధానాలయ ముఖమండపంలోనికి, దర్శన క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాలలోకి వరద నీరు చేరింది.
రెండో ఘాట్‌రోడ్‌కు అనుసంధానంగా నిర్మించిన ఫ్లైఓవర్ ఘాట్‌రోడ్డు కుంగిపోయింది. కొండపైన ఆలయ పరిసర ప్రాంతాల్లో నాటిన కొబ్బరి చెట్లు నెలకొరిగాయి. కొండచరియల ప్రాంతాలు, రహదారులు కోతకు గురయ్యాయి. కొండపైన బస్‌బే, కొండకింద తాత్కాలిక బస్టాండ్ ప్రాంతాలు వరద నీటితో బురదమయంగా మారాయి.
ప్రధానాలయానికి ఉత్తర దిశలోని లోహపు విద్యుత్ స్తంభం విరిగిపడింది. విద్యుత్తు సరఫరాకు సైతం పలుమార్లు అంతరాయం ఏర్పడింది. కొండకింద రింగురోడ్డు రహదారులు వరద నీటితో పూర్తిగా జలమయంగా మారి కుంటలను తలపించాయి. ముఖ్యంగా.. కొండపైన నీటిపారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచింది. ప్రధానాలయం, అష్టభుజి ప్రాకార మండపాల్లోకి చేరిన నీటిని ఆలయ సిబ్బంది తొలగించాల్సి వచ్చింది.
ప్రసాద విక్రయశాలలోకి వర్షపు నీరు రావడంతో భక్తులు ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు వరద నీటిలో వెళ్ళలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రసాదాల తయారీ భవనంపై వరద నీరు నిండిపోయి ట్యాంకును తలపించగా, విష్ణుపుష్కరిణిలోకీ వరద నీరు చేరింది. ఎండవేడి నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు కొండపైన విష్ణుపుష్కరిణి నుంచి శివాలయం వరకూ నిర్మించిన చలువ పందిళ్లు ఈదురుగాలుల తాకిడికి నేలమట్టమయ్యాయి.
ఆలయ నిర్మాణ ప్రణాళికలు, నమూనా డిజైన్లలో లోపాలే ఈ పరిస్థితికి కారణమనే వాదన వినిపిస్తోంది. నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడం, ఆ పనులను కూడా నాసిరకంగా చేయడం వల్లనే కొండపైన, కింద వర్షం పడిన ప్రతిసారీ ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



