News

కలిసి పనిచేద్దాం.. అంతర్జాతీయ సుస్థిరతకు కృషి చేద్దాం: నార్డిక్ దేశాలకు మోదీ సూచన

452views

కోపెన్‌హాగెన్‌: పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పాటునందించగలమని నార్డిక్‌ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో నిర్వహించిన ఇండియా-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు.

ఆధునిక సాంకేతికతలు, శుద్ధ ఇంధనం, పెట్టుబడులు, ఆర్కిటిక్‌లో పరిశోధనలు తదితర అంశాల్లో బహుముఖమైన సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని సూచించారు. ఈ సదస్సులో డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌ దేశాల ప్రధాన మంత్రులు పాల్గొన్నారు.

కరోనా తదనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజం, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలపై సదస్సు ప్రధానంగా దృష్టి సారించింది. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై నేతలు చర్చించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.

అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభంపై నేతలందరూ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ నార్డిక్‌ దేశాల ప్రధాన మంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృత సంప్రదింపులు జరిగాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి