
న్యూఢిల్లీ: ఐరోపా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో రెండు దేశాలు బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్, ఫ్రాన్స్ అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ద్వైపాక్షికమైన పలు అంశాలు సహా అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం గురించి వారు చర్చించుకున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. జర్మనీ, డెన్మార్క్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని మోదీ పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలీసీకి చేరుకున్న మోదీకి అధ్యక్షుడు మెక్రాన్ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.
ఇటీవలే రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన మిత్రుడు మెక్రాన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. “భారత్‌కున్న బలమైన అంతర్జాతీయ భాగస్వాముల్లో ఫ్రాన్స్ ఒకటి. విభిన్న రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటున్నాయి” అని పారిస్ చేరుకున్న వెంటనే మోదీ ట్వీట్ చేశారు.





