News

గవర్నర్ అధికారాలకు కోత పెట్టేలా టీఎన్ స‌ర్కార్ నిర్ణయం

569views
  • సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఖండించిన బీజేపీ

చెన్నై: విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు(టీఎన్‌) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి సోమవారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బిల్లుపై మాట్లాడారు.

” సంప్రదాయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్‌ వర్సిటీల వైస్‌ ఛాన్సలర్లను నియమిస్తారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా గవర్నర్లు దాన్ని తమ ప్రత్యేక హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని అగౌరవపర్చడమే గాక, ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం. అంతేగాక, వైస్‌ ఛాన్సలర్ల నియామకం విషయంలో ప్రభుత్వానికి అధికారం లేకపోవడం ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశ్వవిద్యాలయ పాలనా వ్యవహారాల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది” అని పేర్కొన్నారు.

తమిళనాడులోని రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రారంభించారు. ఇదే సమయంలో స్టాలిన్‌ ప్రభుత్వం గవర్నర్‌ అధికారాల్లో కోత విధించేలా బిల్లు తీసుకురావడం గమనార్హం. అయితే, ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, అన్నాడీఎంకే వ్యతిరేకించాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆక్షేపించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి