
తిరువనంతపురం: కేరళలోని ఎడక్కర మావోయిస్టు కేసులో నిషేధిత సీపీఐ-మావోయిస్ట్‌కు చెందిన 20 మంది కార్యకర్తలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం తెలిపింది.
చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేరళలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్…. భౌతిక, ఆయుధ శిక్షణ, పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ సమావేశాన్ని నిర్వహించడానికి కుట్రకు సంబంధించినది. 2016లో కేరళలోని మలప్పురం జిల్లాలోని నిలంబూర్ అడవుల్లో నిషిద్ధ సీపీఐ-మావోయిస్ట్‌ల కమిటీ ఉగ్రవాద చర్యలకు పాల్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలనే ఉద్దేశ్యంతో సంస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నించింది. కేరళ పోలీసులు మొదట ఈ విషయంలో 2017లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో నిందితులు నిషిద్ధ సీపీఐ-మావోయిస్టు సభ్యులని, మలప్పురంలోని నిలంబూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలోకి చొరబడి శిక్షణా శిబిరాలు, జోనల్ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు కుట్ర పన్నారని ఎన్‌ఐఏ జరిపిన దర్యాప్తులో తేలింది.
వారు సంస్మరణ వారోత్సవాలు, సీపీఐ-మావోయిస్ట్‌ల ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జరుపుకొన్నారు. తమ కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, ఉగ్రవాద చర్యలను నిర్వహించడానికి నిషేధిత ఆయుధాలను ఉపయోగించి ఆయుధాల వినియోగం, శారీరక శిక్షణను నిర్వహించారు.
Source: HINDU POST





