News

సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారు… : ఎంపీ న‌వ‌నీత్ కౌర్ రాణా

460views

ముంబై: మహారాష్ట్ర అమరావతి ఎంపీ, టాలీవుడ్ మాజీ నటి నవనీత్ కౌర్​ రాణా ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి ముంబయిలోని ఆమె నివాసం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటారు.

సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు ఆయన ఇంటిముందు తన భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిసి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు హనుమాన్​ చాలీసా చదువుతానని నవనీత్ గురువారం ప్రకటించారు. దీంతో ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్దకు శివసేన సైనికులు ఉదయం భారీగా చేరుకున్నారు. తొమ్మిది గంటలు దాటినా నవనీత్​ కౌర్​ రాలేదని.. ఆమె ఇంటి వద్దకే వెళ్ళారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మరోవైపు ఠాక్రేకు మద్దతుగా ఆయన నివాసం వద్దకు మహిళలు కూడా తరలివచ్చారు. తాము హనుమాన్ చాలీసా ప్రతులను కూడా తీసుకొచ్చామని, నవనీత్ కౌర్​ రాణా వచ్చి దాన్ని పఠించాలని వారు అన్నారు.

నవనీత్​ రాణా మాత్రం.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మతోశ్రీకి చేరుకుని తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతానని స్పష్టం చేశారు. తమపైకి సీఎం ఠాక్రేనే శివసేన కార్యకర్తలను పంపించారని ఆరోపించారు. ఆయనకు తనలాంటి వాళ్ళ‌ను జైలుకు పంపడం తప్ప ఇంకేం తెలియదని మండిప‌డ్డారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి