
విజయవాడ: ఏడాది పాటు జరిగే శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సంబరాలకు ప్రధాని నరేంద్ర మోదీ జులై నాలుగోతేదీన భీమవరంలో శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు తాము చేసిన ప్రయత్నాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో ఫలించినట్టు క్షత్రియ సేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) ప్రకటించింది.
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జరుపుతున్న “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమంలో భాగంగా గుర్తింపునకు నోచుకోని స్వతంత్ర వీరులను గౌరవిస్తున్న సందర్భంగా శ్రీ అల్లూరి సీతారామరాజు సేవలను భారత ప్రభుత్వం గుర్తించి, గౌరవించాలని నిర్ణయించింది.
తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక మంత్రిత్వ శాఖల వారి సౌజన్యం తో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్షత్రియ సేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) పలు కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టి తరువాత దేశ వ్యాప్తంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించిందని అధ్యక్షులు పేరిచెర్ల నాగరాజు, ప్రధాన కార్యదర్శి నడింపల్లి నాని రాజు తెలిపారు.
జులై నాలుగోతేదీన అల్లూరి స్వగ్రామం మోగల్లు గ్రామంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం సహాయంతో నిర్మించే చారిత్రాత్మక కట్టడాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. అల్లూరి బాల్యంలో గడిపిన మొగల్లు గ్రామంలోని ఇంటిని రీ మోడల్ జరిపి అల్లూరి ధ్యాన మందిరంగా జాతికి అంకితం చేస్తారు. అక్కడ, అల్లూరి జీవిత చరిత్ర, విశేషాలని భద్రపరుస్తారు. తద్వారా అల్లూరి స్వగ్రామం మోగల్లు ఒక ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది.
అల్లూరి తల్లి స్వగ్రామం, ఆయన పుట్టిన పాండ్రంగి గ్రామంలో ఆయన ఆనవాళ్లను పునరుద్ధరించి కాపాడుతారు. రాష్ట్ర, కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో, కృష్ణదేవి పేటలో ఉన్నఅల్లూరి సీతారామరాజు ఉద్యానవనం సుందరీకరణ పనులు చేబడతారు. అల్లూరి తనకు తానుగా బ్రిటీష్ ప్రభుత్వానికి లొంగిపోయిన మంప గ్రామంకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేస్తారు. ఏ చెరువు ఒడ్డున అయితే లొంగిపోయారో, ఆ చెరువు సుందరీకరణ, చెరువు మధ్యలో అల్లూరి విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు.
Source: Nijamtoday





