News

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అష్ట‌క‌ష్టాలు!

603views

తిరుప‌తి: శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అలిపిరి నుంచి ఆనందనిలయం వరకూ అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. కొవిడ్‌ సమయంలో అనేకమంది తమ కోసం, తమవాళ్ల కోసం అనేక మొక్కులు మొక్కుకున్నారు. వృద్ధులు తమ జీవిత చరమాంకంలో ఒక్కసారైనా స్వామిని దర్శించుకుని తరించాలన్న భావనలో ఉన్నారు. కొవిడ్‌ ఆంక్షలు తొలగడంతో భక్తులు తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి పోటెత్తుతుండగా వీరికి అన్నిరకాలుగా ఆటంకాలు తప్పట్లేదు.

కొవిడ్‌కి ముందు ఇటు అలిపిరితోపాటు అటు శ్రీవారి మెట్టుమార్గం ద్వారా కాలినడకన తిరుమలకు అనుమతించేవారు. అలిపిరి మార్గంలో రోజుకు 20వేలు, శ్రీవారి మెట్టుమార్గంలో 6వేల చొప్పున టోకెన్లు జారీచేసేవారు. నడకదారిన వచ్చే భక్తులకు శీఘ్రదర్శనం పేరుతో ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటుచేశారు. 2020 మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన తర్వాత… మళ్లీ ఇప్పటివరకూ దాన్ని పునరుద్ధరించలేదు. నడకదారిన వెళ్లే భక్తుల్ని సైతం ముందుగా సర్వదర్శనం/ప్రత్యేక ప్రవేశదర్శనం (రూ.300) టోకెన్లు ఉంటేనే అనుమతిస్తున్నారు.

కొవిడ్‌కి ముందు క్యూలైన్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, మజ్జిగ అందించేవారు. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గాక వీటి సరఫరా నిలిపివేశారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు కనీసం మంచినీరు ఇవ్వకపోవడంతో శ్రీవారి ప్రధానద్వారం వద్దనే క్యూలైన్లలో కూర్చుని భక్తులు ఆందోళన చేయడం అక్కడి పరిస్థితులకు అద్దం పట్టింది. అయినా అధికారుల్లో మార్పు కనిపించలేదు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి