మీ సరిహద్దుల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నడవకూడదు – నేపాల్ ప్రధానితో భేటీలో స్పష్టం చేసిన భారత ప్రధాని మోడీ

భారత్-నేపాల్ మధ్య సరిహద్దుల్లో నియంత్రణ, ఆంక్షలు లేని పరిస్థితులను దుర్వినియోగపరచకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ ను హెచ్చరించారు. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్ బాతో ఆయన సమావేశమయ్యారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని కొనసాగించాలని ఇరు ప్రదానులూ నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత దేశం, నేపాల్ మధ్య ఆంక్షలు, నియంత్రణ లేని సరిహద్దులను అవాంఛనీయ శక్తులు దుర్వనియోగపరచకూడదని చెప్పారు. ఈ అంశంపై తాము చర్చించామన్నారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు చాలా ప్రత్యేకమైనవవని మోడీ చెప్పారు. ఇటువంటి స్నేహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదని చెప్పారు. విద్యుత్తు రంగంలో సహకరించుకోవడం కోసం తమ సమష్టి విజన్ స్టేట్‌మెంట్ భవిష్యత్తు సహకారం కోసం బ్లూప్రింట్ గా రుజువవుతుందని తెలిపారు.
భారత్-నేపాల్ మధ్య సంబంధాల కోసం దేవ్ బా ఎంతో కీలక పాత్ర పోషించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ప్రజల మధ్య పరస్పర సంబంధాలే ఉభయ దేశాల భాగస్వామ్యానికి ప్రాతిపదిక అని చెప్పారు. ప్రజల మధ్య సంబంధాలే దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయన్నారు. నేపాల్ శాంతియుత, ప్రగతిదాయక, అభివృద్ధి ప్రస్థానంలో స్థిరమైన భాగస్వామిగా భారత దేశం భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో కొనసాగుతుందన్నారు. నేపాల్ జల విద్యుత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భారతీయ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. నేపాల్ తన మిగులు విద్యుత్తును భారత దేశానికి ఎగుమతి చేస్తుండటం సంతోషకరమని చెప్పారు. ఇది నేపాల్ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చేసిన ట్వీట్‌లో, పొరుగు దేశాలకు పెద్ద పీట వేస్తామనే భారత దేశ విధానాన్ని మరోసారి బలంగా చెప్తున్నట్లు తెలిపారు. సొలు కారిడార్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును నేడు నేపాల్ కు అప్పగించినట్లు తెలిపారు. మారుమూల జిల్లాలను నేపాల్‌లోని జాతీయ విద్యుత్తు గ్రిడ్ కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. భారత దేశపు రుణ సహాయం క్రింద చేపట్టిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఇదొకటి అని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ సహాయం క్రింద 68.7 కిలోమీటర్ల జయనగర్-బిజల్‌పుర-బర్డిడాస్ రైల్ లింక్ లో భాగంగా శనివారం 35 కిలోమీటర్ల జయనగర్-కుర్తా సెక్షన్ క్రాస్-బోర్డర్ రైలు సర్వీసును ప్రారంభించారు.
నేపాల్ ప్రధానమంత్రిగా దేవ్ బా గత ఏడాది జూలైలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన ద్వైపాక్షిక సంబంధాల కోసం విదేశీ పర్యటన చేయడం ఇదే తొలిసారి. శనివారం ఇరు దేశాల మధ్య రైల్వేలు, ఇంధనం తదితర రంగాలకు సంబంధించిన నాలుగు ఒప్పందాలు కుదిరాయి.





