
ఉక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా సతమతమవుతోంది. ముఖ్యంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలోనే భారత్ కు చౌక ధరకు ముడిచమురును విక్రయించేందుకు ముందుకొచ్చిన రష్యా… తాజాగా మరింత డిస్కౌంట్ ను ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే రష్యా నుంచి 30లక్షల బ్యారెళ్ల ముడి చమురును డిస్కౌంట్ లో కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ ను మరింతగా ఆకర్షించి ఎగుమతులు పెంచుకోవాలని రష్యా భావిస్తోంది. ఇందుకోసం బ్యారెల్ ధరపై 35 డాలర్ల వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది. యుద్ధానికి ముందున్న ధరకే ఉరాల్ క్రూడ్ ను విక్రయిస్తామని రష్యా ఆఫర్ ఇచ్చిందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
ఈ ఏడాది 15 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును భారత్ దిగుమతి చేసుకునేలా రష్యా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు రూబుల్-రూపాయి చెల్లింపు విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీస్ లవ్రోవ్.. కేంద్రంతో జరిపే చర్చల్లో ప్రధానంగా చౌక చమురు దిగుమతులపైనే దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
కాగా.. యుద్ధ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. ఈ డిస్కౌంట్ ఆఫర్ కు భారత్ అంగీకరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు మీడియా కథనాలు రాసుకొచ్చాయి.
మరోవైపు ఈ చమురు దిగుమతుల విషయంలో భారత్ పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. రష్యాపై విధించిన ఆంక్షలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అగ్రరాజ్యం తాజాగా హెచ్చరించింది. రష్యా నుంచి భారత్ డిస్కౌంట్ లో చమురు కొనుగోలు చేయడం తాము విధించిన ఆంక్షల పరిధిలోకి రావంటూనే.. భారత్ దీనిపై చూపుతున్న ఉత్సాహాన్ని తగ్గించుకోవాలని అమెరికా సూచించింది.





