విజయవాడ సింగ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో, సేవా భారతి మరియు ABVP జిజ్ఞాసల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహింపబడింది. డాక్టర్ ప్రశాంత్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో సేవా భారతి అబ్యాసికలలో చదువుకుంటున్న బాలబాలికలకు, వారి కుటుంబ సభ్యులకు మరియు ఇతరులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఆయుర్వేద మందులను వైద్య బృందం వారు అందించారు. ఉదయం9గంటల నుండి 1.30 వరకు జరిగిన ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో సింగ్ నగర్, రాధా నగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో ఆరోగ్య సమస్యలు ఉన్న సుమారు 100 మందికి వైద్య బృందం ఉచితంగా మందులు పంపిణీ చేసింది.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ పురాతన భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో ఎన్నో దీర్ఘకాలిక రోగాలను సైతం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చెయ్యగలిగే అవకాశం ఉన్నదని తెలిపారు. మన పూర్వీకులు వాడిన ఈ ఆయుర్వేద వైద్య పద్ధతులను అనుసరించి, ఆదరించి మనమందరమూ రోగ విముక్తులం కావాలని, జబ్బుల పేరుతో అనవసరంగా లక్షలాది రూపాయలను తగలేసుకుని ఇంటిని, ఒంటిని గుల్ల చేసుకోవలదని హితవు పలికారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని నమ్ముకుంటే మనను చుట్టిముట్టి ఉన్న పలు రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సేవాభారతి, ABVP కార్యకర్తలు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.