
-
హిందూ చైతన్య సమ్మేళనంలో గరికిపాటి
రాజమహేంద్రవరం: రామ నామన్ని జపించే వాడే, రామాయణాన్ని పఠించేవాడే నిజమైన భారతీయుడని ప్రముఖ ప్రవచనకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గరికపాటి నరసింహరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ధర్మ జాగరణ సమితి ఏర్పాటు చేసిన సభలో శ్రీ గరికపాటి పాల్గొని ప్రసంగించారు. శ్రీ రాముడు తాటకిని సంహరించాడు, అహల్యను అనుగ్రహించాడు, సీతా దేవిని పరిణయమాడాడని ఆయన తెలిపారు.


ముగ్గురూ స్త్రీ మూర్తులే అయినా వారి వారి యోగ్యతను బట్టి వారికి లభించవలసిన శిక్షలు, గౌరవ మర్యాదలు, ప్రేమానుగ్రహాలు లభించాయని, అదే రాముని జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠమని ఆయన పేర్కొన్నారు. వ్యక్తుల గుణగణాలను బట్టే వారిని ఆదరించవలసిన అవసరమున్నదని, ఆ విధమైన పరిశీలనను, విచక్షణను ప్రతిఒక్కరూ అలవరచుకోవాలని ఆయన బోధించారు. వాల్మీకి రచించిన మూల రామాయణాన్ని చదివితే అనేక ధర్మ సూక్ష్మాలు అర్ధమవుతాయని ఆయన తెలిపారు.
కోదండాన్ని ధరించి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ గావించిన ఆ శ్రీరామచంద్రుని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి హిందువూ దండ ధారియై ధర్మ పరిరక్షణకు ముందుకురకాలని శ్రీ గరికపాటి పిలుపునిచ్చారు. మన కోసం మనం పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదని, మనమిక పూజలన్నీ దేశ హితం కోసమే చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామ దీక్షను స్వీకరించి నెల రోజుల పాటు శ్రీ రామ జపం పూర్తి చేసుకున్న వేలాదిమంది రామభక్తులు పాల్గొన్నారు. ధర్మ జాగరణ సమితి ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యదర్శి శ్రీ ఈశ్వరయ్య పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.





