కేంద్రం ప్రకటించిన “వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకం” క్రింద రాష్ట్రం నుంచి ఎంపికయిన తిరుపతి రైల్వే స్టేషన్

కేంద్రం ఇటీవల బడ్జెట్ లో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ విధానాన్ని ప్రకటించింది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సాహించేలా రైల్వే ష్టేషన్ ను ఒక హబ్ గా, ప్రదర్శనశాలగా వినియోగించి స్థానిక హస్త కళాకారులకు, చేనేత, వస్త్ర కళాకారులకు, గిరిజనులకు వారి జీవనోపాధి, సంక్షేమాన్ని మెరుగుపరిచి స్థానిక పరిశ్రమను బలోపేతం చేయాలనేది ప్రధాన లక్ష్యం. స్థానిక ఉత్పత్తుల అమ్మకానికి ఒక మార్కెటింగ్ వ్యవస్థగా ఉండేందుకు స్టేషన్ లో స్టాల్స్ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తారు.
సాధారణంగా రైల్వేస్టేషన్లు జనాభా రద్దీ ప్రాంతాలుగా, ఉత్పత్తి మార్కెటింగ్ కు ప్రధాన ప్రాంతాలుగా ఉంటాయి. ఈ విధానంలో స్థానిక ప్రాంతాలలో ప్రముఖమైన ఆహార పదార్థాలు, హస్తకళలు, స్థానిక బొమ్మలు, తోలు ఉత్పత్తులు, వస్త్రాలు, సంప్రదాయ వస్తువులు, వాయిద్య సాధనాలు మొదలగు వాటి మార్కెటింగ్, ప్రోత్సాహకం కోసం స్టాల్స్ ఏర్పాటుకు స్టేషన్ ప్లాట్‌ఫారాలపై తగిన స్థలం కేటాయిస్తారు.
తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలు…
ప్రారంభ దశలో 15 రోజులు పైలట్ ప్రాజెక్టుగా అమలు పరిచేందుకు ప్రతి జోనల్ రైల్వేలో ఒక స్టేషన్ ను గుర్తించాలని రైల్వే బోర్డు సూచించింది. దీని ప్రకారం 25 మార్చి 2022 నుంచి 15 రోజులు పైలట్ పద్ధతిన ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ను అమలు పరచడానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొదటి స్టేషన్ గా తిరుపతిని ఎంపిక చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి బాలాజీ దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో తిరుపతి స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. తిరుపతి స్టేషన్ పరిసర ప్రాంతాలు కలంకారి పెయింటిగ్స్ కు ప్రఖ్యాతమైనవి. తదనుగుణంగా కలంకారి చీరలు, వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఈ స్టేషన్ ను ఎంపిక చేశారు. దీనికి అదనంగా ఈ ప్రాంతంలో రూపొందించిన ఉడ్ క్రాఫ్టింగ్ వంటి ఇతర బహుళ ఉత్పత్తుల ప్రదర్శనకు/ అమ్మకానికి అనుమతి ఇస్తారు.





