
-
శ్రీ వెంకటేశ్వర జూ. కళాశాల విద్యార్థి ప్రతిభ
తిరుపతి: తిరుమల తిరుపతికి చెందిన ఎస్వీ జూనియర్ కళాశాల విద్యార్థి ఎం.ఓంకార్ కాగితాలతో అద్భుతమైన శ్రీవారి కళారూపాన్ని సృష్టించాడు. చదువుతోపాటు కళల్లో ప్రతిభ కనబరుస్తున్న ఈ విద్యార్థిని టిటిడి పరిపాలన భవనంలోని కార్యాలయంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి అభినందించారు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన శ్రీ ఎం.మధుసూదన్ కుమారుడు ఎం.ఓంకార్ ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపిసి రెండో సంవత్సరం చదువుతున్నాడు.
చిన్నప్పటి నుండి చిత్రలేఖనం అలవాటుగా మార్చుకున్నాడు. దీంతోపాటు కళాశాల సమయం అయిపోయిన తరువాత మిగిలిన సమయంలో కాగితాలతో దేవతామూర్తుల బొమ్మల తయారీని సాధన చేశాడు.
ఈ విధంగా రెండు నెలల సమయంలో మూడు అడుగుల ఎత్తు గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిమను తయారుచేశాడు. మొదట కాగితాలను ఉపయోగించి శ్రీవారి ఆకృతిని తయారు చేశాడు. ఆ తరువాత వాటికి రంగులు అద్ది పూర్తి రూపాన్ని ఆవిష్కరించాడు. ప్రస్తుతం ఇదే తరహాలో శ్రీపద్మావతి అమ్మవారి ప్రతిమను తయారు చేస్తున్నాడు.





