News

‘దావూద్​’ మనీలాండరింగ్​ కేసులో ఈడీ విచారణకు మహారాష్ట్ర మంత్రి

560views

న్యూఢిల్లీ: అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రాహీం మనీలాండరింగ్​ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్​ మాలిక్​ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.

మాలిక్ బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ముంబయిలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు​. ఉదయం ఏడు గంటలకు విచారణ చేపట్టారు. అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రాహీం బంధువుతో ఉన్న సంబంధాలపై మంత్రిని విచారించినట్టు తెలిసింది. దావూద్​ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల కింద‌ట అరెస్టయిన దావూద్​ సోదరుడు ఇబ్రాహీం కస్కర్​తో సహా పలు అనుమానిత నిందితులకు సంబంధించిన సంబంధాలపై ఈడీ ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

దావూద్​, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్​ మాలిక్​ కొనుగోలు చేసినట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్​కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశింతంగా పరిశీలిస్తోంది ఈడీ. ఇబ్రాహీం కస్కర్​ను అరెస్ట్​ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్టు అధికారులు తెలిపారు. ఆ విషయాల ఆధారంగానే నవాబ్​ మాలిక్​కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ కొంతకాలం కింద‌ట‌ ముంబయి, పుణె సహా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకుంది. అందులో అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పద బ్యాంకింగ్​ లావాదేవీల పత్రాలు ఉన్న‌ట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ పత్రాలపైనే మాలిక్​ను ప్రశ్నించిన‌ట్టు పేర్కొన్నారు. నవాబ్​ మాలిక్​ ఈడీ కార్యాలయానికి చేరుకున్న సమయం నుంచి ఆయన నివాసాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్టు అధికారులు చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి