
-
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు
-
నిరసన తెలిపిన వారిపై పోలీసుల లాఠీచార్జ్
-
భజరంగ్ దళ్ కార్యకర్తలకు గాయాలు
భాగ్యనగరం: హైదరాబాద్‌లోని కర్మన్ ఘాట్‌లో గోరక్షకులపై కొందరు దుండగులు దాడి చేశారు. మారణాయుధాలతో గోరక్షకులపై విరుచుకుపడ్డారు. పశువుల రవాణాను గోరక్షకులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి మంగళవారం రాత్రి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గోరక్షకుల బృందం పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును వెంబడించడానికి ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. తమ వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా ట్రక్కు ఢీకొట్టిందని కారులో ఉన్న యువకులు ఆరోపించారు. కొందరు వ్యక్తులు ఆవులను తరలిస్తున్నారని సమాచారం అందుకున్న హిందూ గోరక్షకులు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అర్ధరాత్రి దాటాక గోవులను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని ఇన్నోవా వాహనంలో వెంబడిస్తూ గో రక్షక్ సభ్యులు అడ్డుకున్నారు.
గో రక్షక్ సభ్యుల ఇన్నోవా వాహనాన్ని బొలెరోతో ఢీకొట్టారు. గో రక్షకులపై కత్తులతో దాడి చేసి ఇన్నోవా కారును ధ్వంసం చేశారు. దుండగులు కత్తులతో దాడి చేయడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు గో రక్షక్ సభ్యులు స్థానిక హనుమాన్ దేవాలయంలోకి పరుగులు తీశారు. దేవాలయంలోకి ప్రవేశించిన వారిపైనా దాడి చేసిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గో రక్షక్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
పశువులను తరలిస్తున్న వ్యక్తులు తమపై దాడి చేశారని గోరక్షకులు ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. హనుమాన్ గుడి సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గోరక్షకులపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద నిరసనకు దిగారు. అయితే, వారిని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.
హిందూ సంఘాలు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కర్మన్‌ఘాట్‌కు చేరుకొని దుండగులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Source: NationalistHub





