-
ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన ప్రజ్ఞా నంద
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రపంచ నం.1, నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌కు 16 ఏళ్ళ భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద షాకిచ్చాడు. కేవలం 39 ఎత్తుల్లోనే కార్ల్‌సెన్‌ను చిత్తుగా ఓడించి సంచలనం సృష్టించాడు. గేమ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్‌సెన్‌కు ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. ఈ విజయంతో ఎనిమిది పాయింట్లు సాధించిన ప్రజ్ఞానంద 12వ ర్యాంకుకు చేరుకున్నాడు.
కాగా, తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ళ వయసులోనే ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.